రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పాన్‌గల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. వీనపగండ్ల మండలం తూంకుంటకు చెందిన వసంతపురం వీరస్వామి(37) జిల్లా కేంద్రంలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య, పిల్లలు సొంత గ్రామంలో ఉంటారు. సోమవారం రాత్రి వనపర్తి నుంచి స్వగ్రామం తూంకుంటకు బైక్‌పై వెస్తుండగా మండలంలోని దావాజిపల్లితండా సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన పంట పొలాలలో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య శ్యామల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: పట్టణంలోని కొత్తకోట రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణంలో కొత్తకోట రోడ్డులోని విజన్ స్కానింగ్ సెంటర్ పక్కన 75 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. అతడి ఒంటిపై ఆకుపచ్చ రంగు టీషర్ట్, మెరూన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉందని, గుర్తు పట్టిన వ్యక్తులు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
షార్ట్ సర్క్యూట్‌తో
గుడిసె దగ్ధం
రాజోళి: వడ్డేపల్లి మండల పరిధిలోని బుడమరుసు గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుర్వ వెంకటేశ్వర్లు గుడిసెలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో బంగారం, రూ.2.50 లక్షల నగదు, నిత్యవసర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితుడు పేర్కొన్నాడు.
జాతీయ రహదారిపై వాహనం బోల్తా
మానవపాడు: జాతీయ రహదారి– 44పై డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం జాతీయ రహదారిపై బోరవెల్లి స్టేజి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ మహమూద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కల్పన ప్రథమ చికిత్స అందించి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


