చనిపోయిన వారికి ఎన్నికల విధులు..
నారాయణపేట రూరల్: పంచాయతీ ఎన్నికల నిర్వహణ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు డేటాను అప్‌డేట్ చేయకపోవడంతో తప్పిదాలకు దారితీస్తుంది. ఇటీవల మొదటి విడత ఎన్నికల నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులకు మూడో విడత ట్రైనింగ్‌కు రావాలని ఫోన్ చేయడంతో పాటు గైర్హాజరు పేరుతో షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంఘటన మరవక ముందే.. తాజాగా మరొకటి బయటకు వచ్చింది. మరణించిన ఉపాధ్యాయులకు సైతం ఎన్నికల విధులు కేటాయించడం చూస్తుంటే అధికారుల పనితీరు ఇట్టే అర్థం అవుతుంది. నారాయణపేటకి చెందిన అలివేలుమంగ దామరగిద్ద జీపీఎస్‌లో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ.. ఆరు నెలల క్రితం మృతి చెందింది. అయితే తాజాగా ఆమెకు మాగనూరు మండలంలో ఎన్నికల విధులు కేటాయిస్తూ ఆదేశాలిచ్చారు. అయితే దీనిని చూసిన పలువురు చనిపోయిన వారి ఆత్మ వచ్చి డ్యూటీ చేయలేమో అంటూ సైటెర్లు వేస్తున్నారు. ఇలా చాలా తప్పుల తడకగా ఎన్నికల విధుల కేటాయింపు జరిగిందని ఆరోపణలున్నాయి.


