మా ఊరోళ్ల్లే.. నా గుండెల మీద కొట్టారు
జడ్చర్ల: మా సొంత ఊరుకు ఎంతో చేశా.. కానీ సర్పంచ్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఓడించి తన గుండెల మీద కొట్టారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌తో కలిసి మండలంలోని గంగాపూర్, నసరుల్లాబాద్, చర్లపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరించారు. మంచి అభ్యర్థులను ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గంగాపూర్‌లో పలువురు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండవాలు వేసి ఆహ్వానించారు. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. తన సొంతూరు రంగారెడ్డిగూడలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినా బయటినుంచి వచ్చిన వ్యక్తులు తమ గ్రామస్తులను ప్రభావితం చేసి ఎమ్మెల్యేను ఓడించాలన్న ప్రయత్నం చేశారన్నారు. అయితే తన నియోజకవర్గంలోని అన్నిగ్రామాలు తన సొంతూర్లేనన్నారు. పదేళ్లపాటు ప్రతిపక్షంగా ఉంటూ ప్రజాసమస్యలపై పోరాడానని, నేడు ఎమ్మెల్యేగా ఉదండాపూర్ నిర్వాసితుల పక్షాన ప్రభుత్వంతో పోరాడుతున్నానంటూ వివరించారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్‌రెడ్డి, గిరిప్రసాద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి


