పట్టపగలు ఇంట్లోకి చొరబడి చోరీ
కల్వకుర్తి టౌన్: తాగేందుకు నీళ్లు ఇవ్వాలంటూ వచ్చిన ఓ వ్యక్తి.. ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి మంగళసూత్రం అపహరించుకువెళ్లాడు. ఈఘటన కల్వకుర్తిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న లకీ్‌ష్మ్‌నగర్ కాలనీలో రాజేశ్వరి, సంతోష్‌రెడ్డి దంపతులు నూతనంగా ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే రాజేశ్వరి తన బిడ్డను ఇంటి వరండాలో ఆడిస్తూ ఉండగా.. ఓ వ్యక్తి బాగా దాహంగా ఉంది, నీరు ఇవ్వాలని అడిగాడు. నీరు ఇచ్చాక.. మరోగ్లాస్ ఇవ్వాలంటూ అడగడంతో ఆమెకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకోవాలని చూసింది. ఇంతలోనే ఆ దొంగ తలుపు గడియ పెట్టకుండా అడ్డుతగిలి ఇంట్లోకి చొరబడి రాజేశ్వరిని కొట్టడంతోపాటు ఆమె బిడ్డను పక్కకు విసిరేసి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. రాజేశ్వరి బయటకు వచ్చి చుట్టుపక్కల వాళ్లకు ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పే సరికి అతను పారిపోయాడు. పోలీసులకు బాధితురాలి భర్త ఫిర్యాదు చేయగా సీఐ నాగార్జున, ఎస్‌ఐ మాధవరెడ్డి అక్కడికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
తాగేందుకు నీళ్లు ఇవ్వాలంటూ వచ్చి
మంగళసూత్రం అపహరణ


