బీఎల్వోల తప్పిదం.. ఓటర్లకు శాపం
● సంబంధంలేని వార్డులకు ఓటర్ల బదిలీ
హన్వాడ: రెండో విడత పోలింగ్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో బీఎల్‌ఓల తప్పిదంపై ఓ సీఆర్‌డీ అధికారి నిరుత్సాహం వ్యక్తం చేస్తూ.. విషయాన్ని ఏకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని సీఆర్‌డీ అధికారి మురళీధర్ తన స్వగ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. తాను నివాసం ఉండే 6వ వార్డు నుంచి తన ఓటును 7వ వార్డుకు బదిలీ చేశారు. అదేవిధంగా మండల కేంద్రానికి చెందిన మరో రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఓటు 7వ వార్డు నుంచి 5వ వార్డుకు మార్చారు. దీంతో ఈవిషయంపై సదరు అధికారి మురళీధర్ కలగజేసుకుని ఓ వార్డులో ఉండాల్సిన ఓటును మరో వార్డుకు మార్చడంపై స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. పంచాయతీ అధికారి వివరణ ఇచ్చుకోక మౌనం పాటించాల్సి వచ్చింది. ఇలా ఓటును విడదీసి పక్క వీధిలో వేయడం మూలంగా తన ఇంటి ముందు శానిటేషన్, తదితర సమస్యలపై ఏ వార్డు సభ్యుడిని సంప్రదించాలని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. ఉన్నతస్థాయిలో ఉండే ఓ అధికారికే ఇలాంటి సమస్య వస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని అధికారుల పనితీరును నిలదీశారు. ఈ అంశంపై తనకు క్లారిటీ కావాలని ఏకంగా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. మొత్తానికి బీఎల్‌ఓల నిర్లక్ష్యపు పనితీరుకు కలెక్టర్ సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వచ్చినట్లయిందని పలువురు పేర్కొన్నారు.


