చెల్లని ఓటుతో విజయం
చిన్నచింతకుంట మండలం గూడూర్‌లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున శేఖర్, అదే పార్టీ రెబల్‌గా భీమన్నగౌడ్ పోటీపడ్డారు. ఆదివారం పోలింగ్ అనంతరం కౌంటింగ్ చేయగా.. ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. అభ్యర్థులు రీకౌంటిగ్‌కు అభ్యర్థించడంతో అధికారులు మూడు సార్లు రీ కౌంటింగ్ చేశారు. అయినప్పటికీ సమానంగానే ఓట్లు వచ్చాయి. అయితే టాస్ లేదా చీటి ద్వారా ఎంపిక చేస్తామని అధికారులు తెలియజేయగా.. అభ్యర్థులు ఒప్పుకోలేదు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎల్లన్న పోలింగ్ కేంద్రానికి చేరుకొని మరో రెండు సార్లు కౌంటింగ్ చేయించగా.. అలాగే వచ్చాయి. దీంతో మొదట చెల్లని ఓట్లుగా పరిగణించి పక్కనపెట్టిన ఓట్లను పరిశీలించి.. అందులో గుర్తులపై సక్రమంగా ఓటు పడని పత్రాన్ని స్కేల్ ద్వారా కొలతలు వేసి సర్పంచ్ ఎన్నికను పూర్తిచేశారు. ఉత్కంఠ పోరులో సర్పంచ్‌గా భీమన్నగౌడ్ ఒక్క ఓటుతో అదృష్టం వరించింది.
– చిన్నచింతకుంట


