నాడు తండ్రి.. నేడు కూతురు
● గడ్డంపల్లి సర్పంచ్‌గా గెలిచిన వెన్నెల
నాగర్‌కర్నూల్ రూరల్: నియోజకవర్గ పరిధిలోని తెలకపల్లి మండలం గడ్డంపల్లి గ్రామ సర్పంచ్‌గా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బొక్క వెన్నెల పోటీ చేసి 320 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2001 వెన్నెల తండ్రి కోట్ల జంగయ్య టీడీపీ నుంచి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచి ఐదేళ్లపాటు సేవలందించారు. తాజాగా జంగయ్య అడుగుజాడల్లో ఆయన కూతురు వెన్నెల సర్పంచ్ స్థానానికి పోటీ చేసి గెలవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తాను గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నిక కావడానికి నా భర్త శేఖర్ ప్రోత్సాహంతోపాటు సినీ నిర్మాతలు దిల్‌రాజ్, శిరీష్, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి తోడ్పాటు ఎంతో ఉందన్నారు. తన భర్త శేఖర్ బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి సినీ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ వద్ద 23 ఏళ్లుగా విధులు నిర్వర్తించారని, ప్రస్తుతం తాను పోటీ చేసేందుకు వారు ఎంతో ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. గ్రామస్తులు తనపై నమ్మకాన్ని ఉంచి సర్పంచ్‌గా ఎన్నుకున్నారని, త్వరలో వనపట్ల క్రాస్‌రోడ్ వద్ద రామలింగేశ్వర ఆలయ టార్చును నిర్మిస్తామని, గ్రామానికి వైకుంఠ రథాన్ని అందిస్తానని, గ్రామ అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు.


