విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. శుక్రవారం వరదలు, పరిశ్రమ ప్రమాదాలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ (రిటైర్డ్) వీసీ నిర్వహించారు. వరదలు వచ్చినప్పుడు, పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై జిల్లాలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని, దీనికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వరదలు, పరిశ్రమ ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు అధికార యంత్రాంగం స్పందించాల్సిన తీరుపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జిల్లాలో భారీ వరదల సమయంలో నీటి విడుదలకు పైనున్న ప్రాంతాలు, దిగువ ప్రాంతాలతో సమన్వయం చేసుకుంటూ ఉండాలన్నారు. విపత్తుల సమయంలో వెంటనే ఎన్‌డీఆర్‌ఏఫ్, ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్ వంటి ఏజెన్సీలకు సమాచారం వెళ్లేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, అగ్నిమాపక శాఖ అధికారి కిశోర్, పశువంవర్ధక శాఖ అధికారి మధుసూదన్‌గౌడ్, డీఎస్‌ఓ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ సువర్ణ రాజ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


