ఎట్లనన్న గెలువాలే తమ్మీ!
అచ్చంపేట: పల్లెల్లో పంచాయతీ పోరు హీటెక్కింది. మొదటి విడత ఎన్నికల పోలింగ్ ఈనెల 11న గురువారం మొదలవుతుంది. రెండో విడత 14, మూడో విడత పోలింగ్ 17న జరగనుంది. దీంతో గెలుపు కోసం అభ్యర్థులు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఖర్చుకు ఎక్కడా వెనకాడడం లేదు. రాజకీయ జీవితంలో సర్పంచ్ పదవి మొదటి ఆడుగు కావడంతో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తున్నారు. ఓడిపోవద్దని కొందరు గ్రామానికి భూమి ఇస్తామని, మరికొందరు కులా సంఘాలకు కావాల్సిన భవనాలు కట్టిస్తామని హామీలు ఇస్తున్నారు. మరికొందరు ఆలయాల నిర్మాణాలు, గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామని ముందుగానే ప్రకటిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా.. ఏ ఒక్క ఓటునూ వదలకుండా పట్టుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరికి ఏమివ్వాలి, ఏ కులసంఘాన్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలన్న ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికకు ఒక్కరోజు ఈ తాయిలాలు సమర్పించుకుని, ఓట్లు తీసుకోవడమే తరువాయి అన్నట్లుగా గ్రామాల్లో అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.
ఒకరిని మించి మరొకరు
ఎంత ఖర్చు అయినా.. సర్పంచ్‌గా గెలిచి తీరాలనే పట్టుదలతో అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. చిన్న పంచాయతీల్లో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మేజర్, పెద్ద పంచాయతీల్లో రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చుకు వెనుకాడడంలేదు. గ్రామాల్లో నిర్మించే అలయాలకు పోటీపడి చందాలు ఇస్తున్నారు. యూత్ కోసం శివాజీ, అంబేడ్కర్, ఇతర విగ్రహాల ఏర్పాటు, క్రీడాసామగ్రి హామీలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు.
సంఘాల వారీగా..
ఫలానా సంఘం వాళ్లకు ఫంక్షన్లు చేసుకోవడానికి వంట సాంగ్రి లేదట.. అని తెలియగానే నేనిస్తాగా.. అంటూ అభ్యర్థులు కొనిచ్చేస్తున్నారు. మరో సంఘానికి ఇంకో తాయిలం ఇలా.. వ్యక్తిగతంగా ఇవ్వడంతో పాటు కులసంఘాల వారీగాను అభ్యర్థులు తాయిలాలు ఇస్తూ ఓట్లను రాబట్టుకునే ఎత్తులు వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు తాయిలాలు ఇవ్వడంతోపాటు ఆ కులపెద్దల నుంచి తనకే ఓట్లు వేయాలని మాట తీసుకుంటున్నారు.
● ఖర్చు ఎంతైనా సరే..
● పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అభ్యర్థులు
ఆకట్టుకునే హామీలు
ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో సమర్థుడిని ఎనుకోవాలని, డబ్బు, మద్యం, మాంసాన్నికి అమ్ముడు పోవద్దని పోస్టర్లు, ఫ్లెక్సీలు వేస్తున్నారు. రూపాయి అవినీతికి పాల్పడకుండా గ్రామం కోసం కృషి చేస్తామని అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఆకట్టుకునే హామీలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. జోరుగా ప్రచారం చేసినా.. ఎంతమంచి పేరున్నా ఎంతోకొంత ఇస్తేగానీ తమకు ఓట్లు రావంటూ చాలామంది అభ్యర్థులు ఓట్ల కోసం నోట్ల పంపకాన్నే నమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజుల ప్రచారం ఒకెత్తు.. ఈ రెండ్రోలు మరోఎత్తు అంటూ ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రలోభపర్వంలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు.


