పెళ్లి చేసుకోవాలని అడిగితే ప్రాణం తీశాడు
● యువతి హత్య కేసును చేధించిన పోలీసులు
● రోకలిబండతో తలపై మోది హతమార్చిన ప్రియుడు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ రఘుచందర్
● హతురాలిది నాగర్‌కర్నూల్ జిల్లాగా గుర్తింపు
వెల్గటూర్: పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ప్రియురాలిని అతికిరాతంగా హత్య చేశాడు ఆమె ప్రియుడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో మంగళవారం రాత్రి జరిగిన యువతి హత్యకు సంబంధించిన వివరాలను వెల్గటూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లిగ్రామానికి చెందిన అతినారపు అలివేలు భర్తకు వదిలి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తూ ఒంటరిగా ఉంటోంది. వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన మండలి నరేశ్ ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. ఆ సమయంలో తన కుమారుడికి అనారోగ్యం బాగాలేక గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అలివేలుతో నరేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న నరేశ్ భార్య రెండేళ్ల క్రితం అతడిని వదిలి పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కొన్నాళ్లు సహజీవనం చేసిన నరేశ్, అలివేలు కొన్నిరోజుల క్రితం మంచిర్యాలకు మకాం మార్చారు. కూన లక్ష్మి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉండడంతో ఆమె ఇంట్లో అద్దెకు ఉన్నారు. ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాల కోసం ఆమెనే చంపేశారు. ఆ కేసులో ఇద్దరూ ఆదిలాబాద్ జైలుకు వెళ్లి మూడు నెలల క్రితమే విడుదలయ్యారు. అప్పటినుంచి అలివేలు తనను పెళ్లి చేసుకోవాలని నరేశ్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో నరేశ్ మంగళవారం సాయంత్రం స్తంభంపల్లికి వచ్చాడు. కొద్దిసేపటికే అలివేలు కూడా వచ్చింది. ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవపడ్డారు. తనను పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రోకలిబండతో తలపై కొట్టాడు. ఈ ఘటనలో అలివేలు (38) అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు వినియోగించిన రోకలిబండ, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


