శెభాష్.. భగవేందర్
డీజీపీని చూసి నిమిషాల్లోనే
చిత్రపటం గీసిన గురుకుల విద్యార్థి
నాగర్‌కర్నూల్: హైదరాబాద్‌లోని మీర్‌ఖాన్‌పేటలో ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి నిమిషాల్లోనే డీజీపీ బి.శివధర్‌రెడ్డి చిత్రపటాన్ని గీసి అందరితో ఔరా అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొల్లాపూర్ మండలం ఎత్తం గ్రామానికి చెందిన రాజు – అనిత కుమారుడు ఎ.భగవేందర్ ప్రస్తుతం ఘట్‌కేసర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో గురుకుల విద్యార్థులు ఫైన్ ఆర్ట్స్ స్టాల్ ఏర్పాటుచేశారు. మంగళవారం అక్కడ భద్రతా ఏర్పాట్లను డీజీపీ బి.శివధర్‌రెడ్డి పరిశీలిస్తున్న క్రమంలో విద్యార్థి భగవేందర్ డీజీపీ వద్దకు వెళ్లి ‘సార్ మీ చిత్రపటాన్ని ఇప్పుడే గీసి ఇస్తాను’. అని వినయంగా కోరాడు. బాలుడి ఉత్సాహాన్ని గమనించిన డీజీపీ.. అందుకు అంగీకరించి కొన్ని నిమిషాల పాటు భగవేందర్ ఎదురుగా కూర్చోగా.. కొన్ని నిమిషాల్లోనే ఆయన చిత్రాన్ని గీసి తన చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తొమ్మిదో తరగతి చదువుతూ.. ఇంతటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన భగవేందర్‌ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.


