తొలి తీర్పు నేడే..
బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు 425 మంది
129 గ్రామ పంచాయతీల్లో మొదటి విడత పోలింగ్
పోలింగ్ సిబ్బంది 3,097 మంది
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మొదటి విడత పంచాయతీ సమరానికి సమయం రానే వచ్చింది. జిల్లాలో 423 గ్రామపంచాయతీలు, 3,674 వార్డులు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గురువారం మొదటి విడతగా ఐదు గండేడ్, మహహ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్‌నగర్ రూరల్ మండలాల పరిధిలో పోలింగ్ జరగనుంది. సర్పంచ్, వార్డులకు కలిసి మొత్తం 2,620 మంది బరిలో నిలిచారు. ఈ విడతలో 139 సర్పంచ్, 1,188 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... పది సర్పంచ్ స్థానాలు, మరో 264 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో ఏడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లతో సహా వార్డు సభ్యులతో కలిపి పాలక వర్గం మొత్తం ఏకగ్రీమయ్యాయి. వీటిని మినహాయిస్తే.. 129 సర్పంచ్ స్థానాలకు 924 వార్డులకు పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలి విడతకు సంబంధించి 3097 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో పీఓలు 1,426, ఓపీఓలు 1,671 మంది ఉన్నారు. మొదటి విడత జరిగే 5 మండలాల పరిధిలో మొత్తం 1,188 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వార్డులకు ఇద్దరు, జనాభాను బట్టి మగ్గురు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం పోలింగ్ సిబ్బందితో 20 శాతం అదనంగా పోలింగ్ సిబ్బందిని రిజర్వ్‌లో ఉన్నారు.
తొలి విడతలు జరిగే ఐదు మండలాల్లో మొత్తం 1,60,353 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 79,994 మంది, మహిళలు 80,359 మంది ఉన్నారు. ఇందులో 365 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలానికి సంబంధించిన ఎన్నికల సామగ్రి జిల్లాకేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో, మహమ్మదాబాద్ మండలంలో జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్‌లో, నవాబ్‌పేటలో ఎంపీడీఓ కార్యాలయంలో, రాజాపూర్‌లో జెడ్పీహెచ్‌ఎస్‌లో, గండేడ్‌లో విశ్వభారతి జూనియర్ కాలేజీలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీల వారీగా కేటాయించిన పీఓలు, ఓపీఓలకు సామగ్రిని అందజేశారు. పంపిణీ కేంద్రాల నుంచి గ్రామాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు బందోబస్తుతో తరలించారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. గంటసేపు భోజనం విరామం ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొదటి వార్డులు సభ్యుల ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. పోలింగ్ రోజే పోటీ లో ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. సాయంత్రం
6 గంటలలోగా పూర్తి కావచ్చని అధికారులు చెబుతున్నారు.
మండలాల వారీగా తొలి విడత అభ్యర్థులు ఇలా..
మండలం సర్పంచ్ వార్డు
మహబూబ్‌నగర్ రూరల్ 91 532
నవాబ్‌పేట 130 663
మహమ్మదాబాద్ 60 310
గండేడ్ 79 349
రాజాపూర్ 65 341
ఎన్నికల సామగ్రితో
పోలింగ్ కేంద్రానికి
వెళుతున్న ఉద్యోగులు
బ్యాలెట్ పద్ధతిన ఎన్నికల నిర్వహణ
ఉదయం 7 గంటల నుంచి
ఒంటిగంట వరకు పోలింగ్
మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
తేలనున్న 2,620 మంది సర్పంచ్, వార్డు సభ్యుల భవితవ్యం
తొలి తీర్పు నేడే..
తొలి తీర్పు నేడే..


