‘కొల్లగుట్ట తండా’దే..!
ఈ పంచాయతీలో అత్యల్పంగా 270 ఓట్లే..
మండలాల వారీగా ఇలా..
మొదటి ఫలితం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం 129 సర్పంచ్.. 924 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట
వరకు పోలింగ్ నిర్వహించి రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పలు హామ్లెట్లు, తండాలకు జీపీ హోదా లభించగా.. ఆ గ్రామాల్లో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతి తక్కువ ఓట్లు ఉండడమే ఇందుకు కారణం. మొదటి దఫాలో ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 500 ఓట్లలోపు ఉన్న జీపీలు 15 (నవాబ్‌పేట–5, రాజాపూర్–5, మహబూబ్‌నగర్ రూరల్–2, గండేడ్–2, మహమ్మదాబాద్ 1) కాగా.. ఓట్ల లెక్కింపు చేపట్టిన గంటలోపే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నవాబ్‌పేట మండలంలోని కొల్లగుట్ట తండాలో అత్యల్పంగా 270 ఓటర్లు ఉండగా.. ఇక్కడే తొలి ఫలితం రానున్నట్లు తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 24 జీపీలకు తొలి దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఓబులాయపల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 23 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. భవాని తండా జీపీలో మొత్తం ఓటర్లు 375 కాగా.. ఇక్కడ తొలి ఫలితం రానున్నట్లు తెలుస్తోంది. తువ్వగడ్డ తండాలో 419 కాగా ఇక్కడ కూడా ఫలితం త్వరగా రానుంది. మణికొండలో అత్యధికంగా 3,852 ఓటర్లు ఉండగా.. ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
గండేడ్ మండలంలో 27 గ్రామపంచాయతీలు ఉండగా.. రెండు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 25 జీపీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో అత్యల్పంగా జిన్నారం తండాలో 433 ఓట్లు, గోవిందపల్లిలో 466, సాలార్‌నగర్‌లో 514, మన్సూర్‌పల్లి తండాలో 534 ఓట్లు ఎన్నాయి. ఈ గ్రామాల్లో ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. పంచాంగం తండాలో 631, కప్లాపూర్‌లో 639, చెన్నయ్‌పల్లి తండాలో 659, జానంపల్లిలో 793, అసిరెడ్డిపల్లిలో 817, జంగంరెడ్డి పల్లిలో 976 ఓట్లు ఉన్నాయి. కాగా.. మండలంలోని వెన్నాచెడ్ జీపీలో అత్యధికంగా 4,273 ఓట్లు ఉన్నాయి.
మహమ్మదాబాద్ మండలంలో 22 పంచాయతీలు ఉండగా.. ఆముదాలగడ్డ తండా ఏకగ్రీవమైంది. మిగిలిన 21 జీపీల్లో పోలింగ్ జరగనుంది. ధర్మాపూర్ గ్రామంలో అతి తక్కువగా 384 మంది ఓటర్లు ఉండగా.. ఓట్ల లెక్కింపు చేపట్టిన గంటలోపే ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది. మహమ్మదాబాద్‌లో అత్యధికంగా 5,811 ఓట్లు ఉన్నాయి. తొలి దఫాలో జరిగే ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అత్యధికంగా ఓటర్లు ఉన్న గ్రామం ఇదే. ఇక్కడ ఫలితాలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
నవాబుపేట మండలంలో 42 జీపీలు ఉండగా.. నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 38 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలంలోని కొల్లగుట్ట తండాలో 270 ఓట్లు ఉన్నాయి. మండలంతోపాటు జిల్లాలో అత్యల్ప ఓట్లు ఉన్న గ్రామం ఇదే. అన్నింటికంటే ముందుగానే ఈ జీపీ పరిధిలో సర్పంచ్, వార్డు స్థానాల ఫలితాలు రానున్నట్లు స్పష్టమవుతోంది. అదేవిధంగా మండలంలో మల్లారెడ్డిపల్లిలో 416, మట్టుగడ్డ తండాలో 425, తిమ్మాయపల్లిలో 431, కాకర్జాల్ తండాలో 446 ఓట్లు ఉండగా.. ఫలితాలు గంటలోపు వచ్చే అవకాశం ఉంది. మండలంలో అత్యధికంగా నవాబుపేటలో 3,228 ఓటర్లు ఉన్నారు.
రాజాపూర్ మండలంలో 24 జీపీలు ఉండగా.. మోత్కులకుంట తండా, కల్లేపల్లి ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 22 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మండలంలో అత్యల్పంగా కొర్రతండా జీపీ పరిధిలో 369 ఓట్లు ఉండగా.. ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మోత్కులకుంట తండాలో 424, నర్సింగ్ తండాలో 434, అగ్రహారం పొట్లపల్లిలో 448, రాఘవాపూర్‌లో 472, బీబీనగర్ తండాలో 531, దొండ్లపల్లెలో 546 ఓట్లు ఉండగా.. లెక్కింపు చేపట్టిన గంట లోపు ఫలితాలు రానున్నాయి. మండల పరిధిలో అత్యధికంగా రాజాపూర్‌లో 2,652 ఓట్లు ఉన్నాయి.
మొత్తంగా 15 జీపీల్లో
500ల్లోపే ఓటర్లు
ఆయా చోట్ల గంటలోపు వెల్లడికానున్న ఫలితాలు
తొలిదఫా ఎన్నికల్లో అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 5,811 ఓట్లు
‘కొల్లగుట్ట తండా’దే..!


