వలస వెళ్లిన చోట గొర్రెల కాపరి మృతి
గద్వాల(గట్టు): గొర్రెల మందతో కర్ణాటకకు వలస వెళ్లిన గట్టుకు చెందిన గొర్రెల కాపరి ఉలిగెప్ప (28) అక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గట్టుకు చెందిన కుర్వ డోలన్న కుమారుడు ఉలిగెప్పతో పాటుగా మరో ఇద్దరు కలిసి గొర్రెల మందను మేపడానికి కర్ణాటక ప్రాంతానికి వెళ్లారు. కర్ణాటకలోని ముండ్లదిన్నె శివారులో గొర్రెల మందను నిలిపి ఉన్న తరుణంలో సోమవారం రాత్రి అక్కడే కాపలాగా ఉన్న కుర్వ ఉలిగెప్ప నిద్రలోనే మృతి చెందాడు. గమనించిన తోటి కాపరులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. కర్ణాటక నుంచి మృతదేహాన్ని గట్టుకు తీసుకొచ్చి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య సంధ్యతో పాటుగా ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న నాయకులు బల్గెర హనుమంతునాయుడు, రామకృష్ణారెడ్డి, మోహన్‌గౌడు, సత్యనారాయణ, కృష్ణమూర్తి, ఎస్.కృష్ణ, రామునాయుడు తదితరులు బాదిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఉపాధ్యాయుడి
ఆత్మహత్యాయత్నం
గద్వాల క్రైం: ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని వేణుకాలనీలో ఉంటున్న అయిజ మండలం చిన్నతాండ్రపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు రమణారెడ్డి స్నేహితులతో కలసి ఫైనాన్స్, చిట్టీ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్స్ వ్యవహారం, వ్యక్తిగత సమస్యలతో కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో మనస్థాపం చెందిన రమణారెడ్డి ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


