హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు
● ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
● ఆరేళ్ల విచారణ తర్వాత శిక్ష ఖరారు
● ఒక్కొక్కరికి రూ. 5 వేల జరిమానా
అలంపూర్: హత్య కేసులో గద్వాల జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత ఐదుగురు నిందితులకు జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా విధించినట్లు అలంపూర్ ఎస్‌ఐ వెంకటస్వామి, జిల్లా పోలీస్ కార్యాలయం సంయుక్త ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు.. 2019 జూన్ 4న అలంపూర్‌కు చెందిన చాకలి శాలు భార్య కృష్ణవేణి(అలియాస్ హరిత), పిల్లలతో కలిసి కర్నూలుకు వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇమాంపురం శివారులో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చాకలి శాలును అడ్డగించి పొలాల్లోకి లాక్కెళ్లి హత్య చేశారు. మృతుడి తమ్ముడు గోపి అలంపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ రాజు కేసును విచారించగా మృతుడి భార్య అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియుడు సాంకటి మహేశ్‌తో కలిసి హత్య చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో 2019 జూన్ 7న నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి అప్పటి సీఐ వెంకట్రామయ్య 2020 జూన్ 30న కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం వాదనలు విన్న జడ్జి నిందితులైన చాకలి కృష్ణవేణి అలియాస్ హరిత, సాంకటి మహేష్, దాదపోగు మహేష్, ఈడిగ మహేంద్ర, హుల్చా రాజాకు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. నిందితులకు శిక్ష పడే విధంగా చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోదాచారి, అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగిలయ్యను, సీఐ రవిబాబును, ఎస్‌ఐ వెంకటస్వామి తదితరులను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.


