ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు
1,186 మంది బందోబస్తు
● సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా
బందోబస్తు కేటాయింపు
● అనుమానాస్పద వ్యక్తులపై
నిఘా పెట్టండి
● ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలను కఠినంగా పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి అన్నారు. మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పరేడ్ మైదానంలో పోలింగ్‌బూతుల్లో భద్రత, రూట్ మొబైల్స్ టీంలు, క్యూఆర్‌టీ, స్ట్రైకింగ్ ఫోర్స్, అన్ని బృందాలకు ఎన్నికల విధులపై అవగాహన శిక్షణ నిర్వహించారు. అభ్యర్థులు, ఏజెంట్లు, రాజకీయ కార్యకర్తల ఒత్తిడి లేదా ప్రలోభాలకు లోనుకాకుండా పూర్తి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ స్టేషన్లు దగ్గర అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలతో పాటు మద్యం, డబ్బు పంపిణీలపై వంటి అక్రమాలపై నిఘా పెట్టాలన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా ఓటు వేయగల వాతావరణాన్ని కల్పించాలన్నారు. ప్రధానంగా సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులు, తప్పుడు సమాచారాన్ని పర్యవేక్షించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమాచారం అందిన వెంటనే అధికారులు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడంతో పాటు ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ సమన్వయంతో పటిష్టంగా కొనసాగించాలన్నారు. చిన్నగొడవలనైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలన్నారు. ఎన్నిక వేళ ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రతి పోలీస్ యూనిట్ సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, గిరిబాబు, రమణారెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
మొదటి విడత కింద 139 గ్రామ పంచాయతీల్లో ఏడు ఏకగ్రీవం కాగా 132 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో 28 సమస్యాత్మక, 104 సాధారణ, 167 పోలింగ్ లోకేషన్స్, 1,188 పోలింగ్ స్టేషన్స్ ఉండగా దీనికి 39 రూట్ మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. అలాగే 5 స్ట్రైకింగ్, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ నియామించారు. ఎస్పీ 1, అదనపు ఎస్పీలు 2, డీఎస్పీలు 3, సీఐ,ఆర్‌ఐలు 16, ఎస్‌ఐలు 57, ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్స్ 167, కానిస్టేబుల్స్ 647, హోంగార్డులు 293 మందికి బందోబస్తు కేటాయించారు.


