ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు
● సాధారణ ఎన్నికల జిల్లా పరిశీలకురాలు కాత్యాయనీదేవి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు చేయాలని జిల్లా పంచాయతీ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ విజయేందిరతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీపీ ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే గండేడ్, నవాబ్‌పేట, రాజాపూర్, మహమ్మదాబాద్, మహబూబ్‌నగర్ రూరల్ మండలాల పరిధిలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసిందన్నారు. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు ఈ ఐదు మండలాల్లో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులోకి వచ్చిందని, ఐదుగురు అంతకంటే ఎక్కువమంది గుమిగూడటం నిషేధమని చెప్పారు. 11వ తేదీ పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ మండలాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
ర్యాండమైజేషన్ పూర్తి
మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి సంబంధించిన మూడో విడత ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనీదేవి సమక్షంలో కలెక్టర్ విజయేందిర నిర్వహించారు. ఈ జీపీల్లో పోలింగ్ కేంద్రాలకు విధులు నిర్వహంచే విధంగా ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, ట్రైని డీపీఓ నిఖిలశ్రీ, ఆర్‌డీఓ నవీన్ పాల్గొన్నారు.


