ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
● కలెక్టర్ విజయేందిరబోయి
రాజాపూర్/జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న నిర్వహించే మొదటి విడత ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణ తరగతుల్లో పాల్గొని ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన రాజాపూర్ మండలంలోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పరిశీలించారు. స్టేజ్ 2 అధికారుల ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు పూర్తయినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఎంపీడీఓ విజయలక్ష్మి, డీటీ భారతి, స్టేజ్ 2 అధికారులు ఎల్లయ్య, మోజెస్ తదితరులు ఉన్నారు.
ఎంపీడీఓ కార్యాలయాల్లో
ఓటు సద్వినియోగం
గ్రామ పంచాయతీలో ఓటరుగా ఉండి, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, పోస్ట్‌ద్వారా బ్యాలెట్ పొందే అవకాశం లేనివారు, పోస్టల్ బ్యాలెట్ వసతి వాడుకోలేని వారు ఫారం–14 తీసుకొని నేరుగా తమ ఓటుహక్కున్న మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద ఓటు వేయొచ్చని కలెక్టర్ విజయేందిర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదుపాయం జిల్లాలో మొదటి విడత డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించే గండేడు, మహమ్మదాబాద్, నవాబుపేట రాజాపూర్, మహబూబ్‌నగర్ మండలాల్లో 9న, రెండో విడత జరిగే హన్వాడ, చిన్నచింతకుంట, దేవరకద్ర, కోయిల్‌కొండ, కౌకుంట్ల, మిడ్జిల్ మండలాల వారు 12వ తేదీన, మూడో విడత జరిగే అడ్డాకుల, ముసాపేట, భూత్పూర్, బాలానగర్, జడ్చర్ల మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో ఈనెల 15వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరుకు పోస్టల్ బ్యాలెట్ సమర్పింవచ్చని తెలిపారు. ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తూ జిల్లాలో ఓటుహక్కు కలిగిన ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు పేర్కొన్నారు. జిల్లా, మండలాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తూ, తమ సొంత మండలంలో ఓటుహక్కు కలిగిన ఉద్యోగులందరూ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ


