ముచ్చటగా 3 నెలలకే..!
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ జంక్షన్‌లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘మహా కేఫ్’ నిర్వహణ లేమితో ముచ్చటగా మూడు నెలలకే మూతబడింది. వాస్తవానికి దీనిని మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.ఏడు లక్షలతో నిర్మించారు. ఇందులో మెప్మా తరఫున నవభారత్ పట్టణ సమాఖ్య రూ.2.23 లక్షలను భరించగా అనంతరం ప్రభుత్వం తిరిగి చెల్లించింది. ఈ క్రమంలోనే ఆగస్టు 18న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే హడావుడిగా హనుమాన్‌పురాకు చెందిన ఆర్‌పీ పద్మకు మెప్మా అధికారులు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమె సొంతంగా రూ.1.25 లక్షలు వెచ్చించి ఫర్నిచర్ (ర్యాక్స్)తో పాటు తినుబండాల తయారీకి ఉపయోగించే పరికరాలను కొనుగోలు చేశారు. అందులో టీ, స్నాక్స్, ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ అందుబాటులో ఉంచారు. అక్కడ సువిశాలమైన స్థలం ఉండటంతో ఆరుబయట ఎవరు వచ్చినా కూర్చోవడానికి ఏర్పాట్లు సైతం చేశారు.
ఎక్కువ గిరాకీ ఉండటంతో..
నగరం నడిబొడ్డున ముఖ్యకూడలిలో ‘మహా కేఫ్’ ఉన్నందున ప్రతి నిత్యం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు గిరాకీ అయ్యేది. ఇక్కడ అడ్డా బాగుందని కొందరు మాజీ కౌన్సిలర్లు తాము సూచించిన వారికే నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయసాగారు. దీంతో అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఇటీవల మెప్మా అధికారులను పిలిపించుకుని ఆరా తీశారు. దీనిని కేవలం ఎస్‌హెచ్‌జీ మహిళలకు మాత్రమే అప్పగించాలని ఆదేశించారు. ముఖ్యంగా గతంలో బేకరీ, తినుబండారాల తయారీపై శిక్షణ తీసుకున్న 13 మందిలో ఎవరు ముందుకొచ్చినా, వారికి ఇ వ్వాలని సూచించారు. అనంతరం మెప్మా పీడీ మహమ్మద్ యూసుఫ్ అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చి పూర్తి నివేదిక సమర్పించారు. దీంతో 13 మందిలో కనీసం ముగ్గురికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆర్‌పీ పద్మ చివరకు గత నెల 21 నుంచి ‘మహా కేఫ్’ను మూసివేశారు. తాను సొంతంగా ఫర్నిచర్‌కు పెట్టిన ఖర్చులను తిరిగి చెల్లిస్తేనే తాళం చెవి అప్పగిస్తానని మెప్మా అధికారులకు బదులివ్వడం గమనార్హం. ఇలా మొండికేయడంతో ఆమైపె పోలీసు కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు.
జిల్లాకేంద్రంలోమూతబడిన ‘మహాకేఫ్’
ఆగమేఘాల మీద ప్రారంభించిన అధికారులు
ఆ తర్వాత నిర్వహణ లేమితో చేతులెత్తేసిన వైనం
తాళం చేతులు అప్పగించని హనుమాన్‌పురా ఆర్‌పీ
ఎస్‌హెచ్‌జీలు మాత్రమే నిర్వహించాలన్న ఉన్నతాధికారులు


