మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
పాలమూరు: విద్యార్థుల ఆలోచనలు నిరంతరం ఉత్తమ భవిష్యత్ వైపు పరుగెత్తాలి తప్పా మరో ధ్యాస ఉండడరాదని, గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి ప్రణాళిక ప్రకారం చదువుపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర సూచించారు. నగరంలోని బండమీదిపల్లిలో ఉన్న అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం పలు రకాల చట్టాలతో పాటు పోక్సో, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థికి ఎప్పుడూ కెరీర్‌పై ఫోకస్ ఉండాలని, ఇతర అంశాలు కాదన్నారు. సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లకు దూరంగా ఉండాలన్నారు. డీసీపీఓ నర్మద, సద్దాం హుస్సెన్, కలీం పాల్గొన్నారు.
19 నుంచి స్వయం ఉపాధి శిక్షణ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఈనెల 15వ తేదీ నుంచి 19వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అఽధికారి ఎస్.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కో ర్సు, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొ న్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని, శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారు సర్టిఫికెట్ ఇస్తారని వివరించారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 14 తేదీ లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు కేంద్రం ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి (9440788502)ని సంప్రదించాలని కోరారు.
ఆర్‌ఎన్‌ఆర్ @ రూ.2,839
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డు కు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 9వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,839, కనిష్టంగా రూ.1,660 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.1,869, కనిష్టంగా రూ.1,681, సోనామసూరి రూ.2192, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,971, కనిష్టంగా రూ.1,921, ధరలు పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2702, కనిష్టంగా రూ.2,459, సోనామసూరి గరిష్టంగా రూ.2,371, కనిష్టంగా రూ.2,301, హంస గరిష్టంగా రూ.1,950, కనిష్టంగా రూ.1,859గా ధరలు లభించాయి.


