స్థానిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలి
మెట్టుగడ్డ: బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించి బీసీల రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్‌గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. చట్టబద్ధంగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వలేమని, పార్టీపరంగా ఇస్తామని ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ప్రకటించిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇప్పుడు ఆ మాటే మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనరల్ స్థానాల్లో ఎంతమంది బీసీ అభ్యర్థులకు మద్ధతు ఇస్తున్నారో వారి జాబితా వెల్లడించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగినందుకే సాయి ఈశ్వర్‌చారి ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని, అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 5,380 సర్పంచ్ స్థానాలు దక్కేవని, రిజర్వేషన్లు 17 శాతానికి తగ్గించడంతో బీసీలు రాజకీయంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు భరత్, వీవీగౌడ్, అంజన్న యాదవ్, శివ, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేశ్, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


