పండగ సాయన్న వర్ధంతిని ఘనంగా నిర్వహిద్దాం
మెట్టుగడ్డ: పండుగ సాయన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుందామని బీసీ జేఏసీ చైర్మన్ బెక్కెం జనార్దన్ తెలిపారు. శనివారం టీఎన్‌జీవో భవన్‌లో మన ఆలోచన సాధన సమితి సంస్థ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆనాటి తెలంగాణ సమాజంలోని జమీందారుల భూస్వాముల పెత్తందారితనాన్ని ప్రశ్నించిన పండుగ సాయన్నను స్మరించడం పాలమూరు ప్రజల బాధ్యత అని పేర్కొన్నారు. పండుగ సాయన్న నిజాం నిరంకుశ ఆధిపత్యాన్ని నిలదీశారని, పేదవర్గాలు జీవించే హక్కు కోసం నిరంతరం పోరాటం చేశారని, వెనకబడిన కులాల ఆత్మగౌరవం కోసం ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. మన ఆలోచన సాధన సమితి ఉపాధ్యక్షులు బ్రహ్మయ్య మాట్లాడారు. ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆదివారం టీఎన్‌జీవో భవన్‌లో మధ్యాహ్నం 1:30కు నిర్వహించే వర్ధంతి సభకు బీసీలు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మన ఆలోచన సాధన సమితి నాయకులు విద్యాసాగర్ ముదిరాజ్, బ్రహ్మయ్య, నరహర చారి, విట్టలయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.


