ఆలయ ముఖద్వారం వద్ద నిలిచిన రాకపోకలు
జడ్చర్ల: మండలంలోని గంగాపూర్‌లో ప్రసిద్ధి చెందిన లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవస్థానానికి సంబంధించిన ముఖద్వారాన్ని వరిధాన్యం బస్తాలతో వెళ్తున్న ఓ లారీ శనివారం రాత్రి అతివేగంగా ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే.. ఈ నేపథ్యంలో ముఖద్వారాన్ని తొలగించడం మినహా మరే ఇతర పరిష్కారంలేదని గ్రామస్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఆదివారం సంబంధిత ముఖద్వారం వద్ద యథాస్థితి నెలకొంది. ముఖద్వారం కిందుగా రాకపోకలను నిలిపివేశారు. రహదారిపై అడ్డుగా స్టాపర్లు పెట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జడ్చర్ల, కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి కోడ్గల్ వైపు వెళ్లాలంటే ఇక్కడి ముఖద్వారం కిందుగా వెళ్లాల్సి రావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామ శివారులోని ఎల్లమ ఆలయం సమీపంలోని అంతర్గత రహదారిని ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. అయితే ముఖ ద్వారానికి అనుకుని ముందువైపు ఆంజనేయస్వామి, గరుత్మంతుడి విగ్రహాలకు కూడా ముప్పు ఏర్పడే పరిస్థిత నెలకొంది. దీంతో క్రేన్ సహాయంతో ముఖద్వారాన్ని వెనుక వైపు కూలిస్తే ముందు ఉన్న విగ్రహాలను రక్షించే పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాగా ముఖద్వారాన్ని సుమారు 45ఏళ్ల కిందట నిర్మించారని మాజీ సర్పంచ్ అనంతరెడ్డి తెలిపారు. కాగా సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించాల్సి ఉందని, వారి నిర్ణయం మేరకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది.


