దక్షిణకాశీకి పోటెత్తిన భక్తులు
● కిక్కిరిసిన జోగుళాంబ
బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు
ప్రత్యేక అలంకరణలో జోగుళాంబ అమ్మవారు
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ క్షేత్రానికి బుధ వారం భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ముందుగా తుంగభద్ర పుష్క ర ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి.. జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించా రు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనానికి క్యూ కట్టారు. క్షేత్రం పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఆలయానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం వాహనాల ను దారి మళ్లించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కాకుండా సీఐ రవిబాబు, ఎస్‌ఐ శేఖర్ వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు. క్యూలైన్‌లో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. కాగా, ఆలయం వద్ద పలువురు భక్తుల జేబుకు దొంగలు చిల్లు పెట్టారు. కర్నూలుకు చెందిన లక్ష్మీదేవి పర్సును చోరీ చేశారు. అందులో రూ. 15వేల విలువైన సెల్‌ఫోన్, డబ్బులు ఉన్నట్లు బాధితురాలు తెలిపారు. అదే విధంగా రాయచూరుకు చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళ హుండీలో డబ్బులు వేయడానికి పర్సు తీయగా.. అది ఖాళీ అయినట్లు తెలిపారు. దర్శనానికి వెళ్లి వచ్చిన తర్వాత తమ పర్సులో ఉండాల్సిన దాదాపు రూ. 6వేల నగదు కనిపించలేదని కలత చెందారు.
● కార్తీక పౌర్ణమి సందర్భంగా అలంపూర్ క్షేత్రంలో నదీ హారతి, జ్వాల తోరణం కార్యక్రమాలను కనులపండువగా నిర్వహించారు.


