అమరుల త్యాగాలు స్మరించుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల సేవలను ప్రతిఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎస్పీ జానకి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా పరేడ్ మైదానంలో ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో ఉండే షీటీం, భరోసా సెంటర్, ట్రాఫిక్ విభాగం, సైబర్ క్రైం, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఐటీ సెల్ విభాగాల పనితీరును విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సహకారం లేకుండా చట్ట వ్యవస్థ సక్రమంగా పనిచేయడం సాధ్యం కాదన్నారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీస్ శాఖలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక ప్రగతిని గమనించాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఆర్‌ఐలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం చేయాలి..
పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసులు సమయపాలన, బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో కోర్టు డ్యూటీ, కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టులకు సంబంధించిన అన్ని రకాల విధులు, పత్రాలు, సాక్ష్యాధారాలు నిర్ణీత సమయంలో సమర్పించాలన్నారు. ప్రతి కేసులో ప్రస్తుత పరిస్థితిని వివరంగా తెలుసుకుని కోర్టులో శిక్షలు ఖరారయ్యే విధంగా చూడాలన్నారు.


