నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మద్దతు ధర
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులు నాణ్యతా ప్రమాణాలతో పంట ఉత్పత్తులు తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ మండలపరిధిలోని అప్పాయిపల్లి శివారులో శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ డీకే అరుణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి విక్రయించాలని సూచించారు. పత్తికి 8 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ.8,110 మద్దతు ధర, 9 శాతం ఉంటే రూ.8,020 వస్తుందని అన్నారు. 12 శాతం ఉండే పత్తిని సైతం పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్తగా కిసాన్ కపాస్ యాప్‌ను తీసుకొచ్చిందన్నారు. ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్‌తో మాత్రమే పత్తి కొనుగోళ్లు జరుగుతాయన్నారు. సీజన్‌లో ఒక రైతు మూడు దఫాలుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చని, ఏదేని కారణాలతో బుకింగ్‌ను కూడా రద్దు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మార్కెటింగ్‌శాఖ ఏడీ బాలమణి, ఏడీఏ రాంపాల్, ఏఓ శృతి, నాయకులు సిరాజ్ ఖాద్రీ, గోవింద్‌యాదవ్, నరేందర్‌రెడ్డి, రఘు పాల్గొన్నారు.


