ప్రజావాణికి45 ఫిర్యాదులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. ప్రజవాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్‌లో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. 45 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలను ఊరికే తిప్పుకోవద్దని సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సిములు పాల్గొన్నారు.
నేటి నుంచి జిల్లాలో
జాగృతి జనం బాట
ప్రాజెక్టుల నిర్వాసితులతో కవిత సమావేశం
మెట్టుగడ్డ: జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు జాగృతి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామమూర్తి సోమవారం ప్రకటనలో తెలిపారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో మొదటిరోజు మంగళవారం జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ నిర్వాసితులతో సమావేశమవుతారని, ఆ తర్వాత మీనాంబరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్వెన ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు. జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడతారని, దేవరకద్ర నియోజకవర్గంలోని అప్పంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి కురుమూర్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తారని పేర్కొన్నారు. రెండోరోజు బుధవారం సుదర్శన్ ఫంక్షన్ హాల్‌లో మేధావులు, అన్ని కుల సంఘాలతో ములాఖత్ నిర్వహిస్తారని తెలిపారు.
‘వారంతట వారేబయటికి వస్తున్నారు’
నవాబుపేట: ‘నన్ను ఓడించాలని గడిచిన ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారే ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు.’అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నవాబుపేట మండలంలో పర్యటించిన ఆయన ఇటీవల సొంత పార్టీ నాయకులు తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు స్పందించారు. పార్టీ వ్యతిరేక శక్తులు వారంతట వారే ఒక్కొక్కరూ బయటికి వస్తున్నారని, ఇటీవల జరిగిన పరిణామాలు గమనిస్తే తెలుస్తుందన్నారు. కోవర్టులుగా మారి పార్టీకి ద్రోహం చేసిన వారు త్వరలోనే మరింత మంది బయటికి వస్తారని తెలిపారు. పార్టీ కోసం, తన గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు తాను ఎప్పటికీ మరువనని, వారికి నిరంతరం అండగా ఉంటానని పేర్కొన్నారు.
ర్యాగింగ్ చేస్తే భవిష్యత్ నాశనం చేసుకున్నట్లే
మహబూబ్‌నగర్ క్రైం: మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలే గానీ ర్యాగింగ్ చేయరాదని ఎస్పీ డి.జానకి అన్నారు. ర్యాగింగ్ సరదా కాదని ఒక నేరం కిందకు వస్తుందని అలాంటి చర్యలకు పాల్పడితే మీ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. పాలమూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సోమవారం యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ చదువుకు సహకరిస్తున్నారనే విషయం మరిచిపోరాదని, వాళ్లకు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించరాదన్నారు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారని అనిపించినా, మీరు బాధితుడిగా అనిపించిన వెంటనే కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీకి లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు. ర్యాగింగ్ బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంటాయని, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ర్యాగింగ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యల తప్పవన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, ప్రొఫెసర్లు సునందిని, రూరల్ సీఐ గాంధీనాయక్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి45 ఫిర్యాదులు


