పటేల్ ఆశయాలను సాధించాలి
● 31న ఏక్తా ర్యాలీలో భాగంగా 8 కిలోమీటర్ల పాదయాత్ర
● ఎంపీ డీకే అరుణ
పాలమూరు: దేశ సమైక్యత కోసం పోరాడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధన అందరిపై బాధ్యత ఉందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈనెల 31న పటేల్ జయంతి కార్యక్రమాలపై సోమవారం ఎంపీ కార్యాలయంలో యూనిటీ మార్చ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పటేల్ 150వ జయంతిని అధికారికంగా నిర్వహించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని ‘ఏక్ భారత్–ఆత్మ నిర్బర్ భారత్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏక్తా ర్యాలీలో భాగంగా ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుందని, ఇందులో పార్టీలకతీతంగా ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ నెల 31న వల్లభాయ్ పటేల్ విగ్రహాలకు నివాళి, అదేవిధంగా స్టేడియం గ్రౌండ్ నుంచి తెలంగాణ చౌరస్తా, క్లాక్‌టవర్, అశోక్ టాకీస్ మీదుగా పిల్లలమర్రి వరకు ఏక్తామార్చ్ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా వైద్య శిబిరాలు, కళాశాల, పాఠశాలలో వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న మేరా యువభారత్ కేంద్రంలో మౌలిక సదుపాయాలతో పాటు యువతకు నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇస్తూ మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పద్మజారెడ్డి, కోటానాయక్, గాల్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, తిరుపతయ్య పాల్గొన్నారు.


