
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
మదనాపురం: సరళసాగర్ సమీపంలోని ఊకచెట్టు వాగులో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి గల్లంతైన ఘటన మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొత్తకోటకు చెందిన పి.శేఖర్ (32) తన తమ్ముడు ఊషన్న, కుమారులు గణేష్, శ్రీనివాసులుతో కలిసి చేపల వేటకు ఊకచెట్టు వాగుకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో నీట మునిగాడు. గుర్తించిన తోటి వారు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా.. భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి పొద్దుపోయే వరకు ముమ్మరంగా గాలించినా లభ్యం కాలేదు. ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.