
రోడ్డు ప్రమాదంలో డీఎస్పీకి గాయాలు
జడ్చర్ల: దసరా వేడుకల్లో సీఎం బందోబస్తులో భాగంగా గురువారం ట్రాఫిక్ పరిశీలనకు మిడ్జిల్ వైపు వెళ్తున్న మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఇన్నోవా వాహనాన్ని గంగాపూర్ శివారులో వేగంగా వచ్చిన లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డ్రైవర్ రంగారెడ్డి, గన్‌మెన్ శ్రీనివాసులు గాయపడ్డారు. పోలీసు వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో పోలీసులకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏనుగొండ ఎస్‌వీఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీని విడిచి పెట్టి పరారయ్యాడు. డ్రైవర్ రంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
ఎమ్మెల్యే , డీఎస్పీ పరామర్శ
డీఎస్పీ వెంకటేశ్వర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి వారిని ఆస్పత్రిలో పరామర్శించారు.
మహబూబ్‌నగర్ క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిబ్బందిని ఎస్పీ డి.జానకి పరామర్శించారు. రోడ్డు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీసు వాహనాన్ని
ఢీకొట్టిన లారీ