
బాలింత మృతితో బంధువుల ఆందోళన
● ప్రసవం తర్వాత వేరే గ్రూప్ రక్తంఎక్కించడంతో ఇన్‌ఫెక్షన్
● హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
● ఆడబిడ్డ కోసం వెళ్తే ప్రాణం తీశారు..
కల్వకుర్తి టౌన్: ప్రసవం తర్వాత బాలింతకు తన గ్రూప్ రక్తం ఓ పాజిటివ్ కాకుండా ఇతర గ్రూప్ రక్తం ఎక్కించడంతో ఇన్‌ఫెక్షన్ అయి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు, అంజనమ్మ (25) భార్యభర్తలు. వీరికి గతంలోనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. కానీ ఆడబిడ్డ కోసం వేచి ఉన్న వారు మూడో కాన్పు కోసం సెప్టెంబర్ 6న పట్టణంలోని రమ్య ఆస్పత్రికి వచ్చారు. అంజనమ్మను పరీక్షించిన ఆస్పత్రి వైద్యురాలు రమ్య ఆమెకు కాన్పు చేసి, బాలింతకు రక్తం తక్కువగా ఉందని, ఎక్కించాలని సూచించారు. వెంటనే భర్త ఆంజనేయులు జిల్లా కేంద్రానికి వెళ్లి రక్తం తీసుకొని రాగా.. అదే రోజు రక్తాన్ని బాలింతకు ఎక్కించారు. అనంతరం ఆమెకు ఇన్‌ఫెక్షనై కాళ్లు, చేతులు వాయటంతో పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వారు మెరుగైన వైద్యం కోసం పేరొందిన మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడే చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి శుక్రవారం బాలింత మృతి చెందింది. దీంతో బాలింత మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పట్టణంలో కాన్పు చేసిన రమ్య ఆస్పత్రి ఎదుట ఉంచి బాధిత కుటుంసభ్యులు ఆందోళన చేపట్టారు.
రూ. లక్షలు ఖర్చు చేసినా..
బాలింతకు హైదరాబాద్ ఆస్పత్రిలో దాదాపు 26 రోజుల చికిత్స కోసం రూ.30 లక్షల వరకు ఖర్చయ్యిందని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. రమ్య ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉండటంతో ముందుగానే గమనించిన యాజమాన్యం బాధిత కుటుంబ సభ్యులను ఎప్పకప్పుడు వాకబు చేసేవారని భర్త ఆంజనేయులు తెలిపారు. ప్రతిరోజు యాజమాన్యం తరఫున హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఓ సీఐ స్థాయి అధికారి పరామర్శించేవాడని, మానవతా ధృక్పథంతో రూ.50 వేలు ఇస్తున్నానని డబ్బులు కూడా ఇచ్చాడని భర్త అన్నారు. పూర్తిగా తన భార్య మరణానికి ఆస్పత్రి వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమని వారు వాపోయారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పసికందును చూపిస్తూ బాధిత కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వారిని కలిచివేశాయి. ఒక్కసారిగా ఆస్పత్రి వద్ద జనం గుమిగూడటంతో కల్వకుర్తి సీఐ నాగార్జున, ఎస్‌ఐ మాధవరెడ్డి అక్కడికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. పట్టణానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసుల సమక్షంలో బాధిత కుటుంబ సభ్యులతో రాజీ కుదిర్చేలా చర్చలు జరుపుతున్నారు. పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఎలాంటి మరణాలు సంభవించినా రాజకీయ నాయకులు, పోలీసులు వెంటనే ప్రత్యక్షమవ్వటంపై పట్టణంలోని ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

బాలింత మృతితో బంధువుల ఆందోళన