
చెరువులో మృతదేహం లభ్యం
గోపాల్‌పేట: రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామ సమీపంలోని చెరువులో దసరా పండుగ రోజు ఓ మృతదేహం లభ్యమైంది. రేవల్లి ఎస్‌ఐ రజిత తెలిపిన వివరాల మేరకు.. చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విచారణ జరపగా నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లికి చెందిన మధురాజు పర్వతాలు (40)గా గుర్తించారు. పర్వతాలు సెప్టెంబరు 30న ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతడి భార్య కవిత నాగర్ కర్నూల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈనెల 2న నాగపూర్ సమీపంలోని చెరువులో మృతదేహం కనిపించగా పోలీసులు.. కవితకు చూపించగా తన భర్తదేనని గుర్తించింది. భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని తెలుపగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మద్యం తాగి వృద్ధుడు మృతి
ఖిల్లాఘనపురం: మద్యంతాగి ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండలం మల్కిమియాన్‌పల్లిలో గురువారం చోట్టు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన పూల శ్రీశైలం(61) తన భార్య పూల సత్యమ్మతో కలిసి మెల్కిమియాన్‌పల్లి శివారులోని బాలాజీ రైస్‌మిల్లులో కూలిపనులు చేసుకుంటు జీవిస్తున్నారు. గురువారం దసరా పండుగ సందర్భంగా గ్రామంలోకి వెళ్లి మద్యం తాగాడు. సాయంత్రం వాంతులు చేసుకుని చాతిలో నొప్పి వస్తుందని చెప్పి ఇబ్బందిపడ్డాడు. వెంటనే అతన్ని ఓ ప్రైవేటు వాహనంలో ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహామేరకు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌గనర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై శుక్రవారం మృతుడి భార్య పూల సత్యమ్మ తన భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని మద్యం తాగడంతోనే మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
నవాబుపేట: కుటుంబ తగాదాలతో భార్య విడిచిపెట్టి వెళ్లిందని మనస్తాపంలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఊరంచుతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన దీపక్(36) భార్య రెండేళ్ల క్రితం కుటుంబ తగాదాలతో విడిచిపెట్టి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ తీవ్ర మనోవేదనతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంలో అతని మామ రాములు నాయక్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
ఈతకు
వెళ్లి వ్యక్తి మృతి
మల్దకల్: పండగ పూట విషాదం నెలకొన్న ఘటన మండలంలోని దాసరిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ పూజారి హన్మంతు(35)కు కల్లు తాగే అలవాటు ఉంది. గురువారం పండగ సందర్భంగా కల్లుతాగి తోటిమిత్రులతో కలిసి బావిలో ఈతకు వెళ్లాడు. మత్తులో ఉన్న హన్మంతు బావిలో ఈత కొట్టే క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి బావిలోనే మునిగిపోయాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో ఘటనా స్థలానికి చేరుకుని హన్మంతు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య శంకరమ్మతోపాటు ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ పురందర్ తెలిపారు.