
పండుగకు వచ్చి.. భార్యను చంపేశాడు
మక్తల్: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన ఘటన శుక్రవారం మండలంలో వెలుగుచూసింది. మండలంలోని సత్యవార్ గ్రామానికి చెందిన వినోద (35) కర్నూల్‌కు చెందిన కృష్ణారెడ్డి దంపతులు. వీరు హైదరాబాద్‌లో పనులు చేస్తూ జీవించేవారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో తండ్రి సత్యారెడ్డి కూతురు వినోదను ఇటీవల స్వగ్రామానికి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నారు. భర్త అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. దసరా పండుగ ఉండడంతో భర్త కృష్ణారెడ్డి శుక్రవారం కూడా భార్య దగ్గరకు వచ్చాడు. ఇద్దరు పొలానికి వెళ్లి మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో మార్గమధ్యలో ఒక్కసారిగా భార్యను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తండ్రి సత్యారెడ్డి పొలానికి వెళ్లగా కూతురు కొన ఊపిరితో ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలోనే చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వినోదకు 13 ఏళ్ల కొడుకు ఉన్నాడు. హత్య ఘటనపై ఎస్‌ఐ భాగ్యలక్ష్మారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.