
విద్యా ప్రమాణాలు పెంచేలా చర్యలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అపార్ ఐడీ విద్యార్థులందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో సీసీ టీవీలు ఎన్ని ఉన్నాయి.. ఎన్ని పనిచేస్తున్నాయి.. ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు, కంప్యూటర్లు, బిల్డింగ్ మరమ్మతు, విద్యుత్, టాయిలెట్లు వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాల, కళాశాలల్లో వైద్య సేవలు అందిస్తున్నారా అని ఆరాతీశారు. ఎఫ్‌ఎ–1, 2 పరీక్షలు, విద్యార్థులకు వచ్చిన మార్కుల గురించి వాకబు చేశారు. ఈ నెల 22 నుంచి నిర్వహించే ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా స్వచ్ఛతా హీ సేవ
స్వచ్ఛతతో పల్లెలు మెరవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. తన చాంబర్‌లో స్వచ్ఛోత్సవన్ థీమ్ పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. బుధవారం నుంచి వచ్చే నెల 2 వరకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. ముఖ్యంగా చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించి శుభ్రపరచడం, అన్ని విద్యాసంస్థల్లో పారిశుద్ధ్య చర్యలు నిర్వహించారు. క్లీన్ గ్రీన్, సఫాయి మిత్ర సురక్ష శిబిర్, శ్రమదానాలు, వేస్ట్ నుంచి ఆర్ట్ క్రియేట్ చేయడం, ఫుడ్ స్టీట్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలు అన్ని శాఖల భాగస్వామ్యంతో చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.