
రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్ ముఖ్యం
స్టేషన్ మహబూబ్‌నగర్: రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తే తనకు ముఖ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శతశాతం కార్యక్రమానికి ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు, ఐదు సంవత్సరాలు మీ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. మీ పిల్లల భవిష్యత్ కోసం ప్రతిరోజు పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టీవీలు, సెల్‌ఫోన్‌లు కట్టిపెట్టాలన్నారు. మీరు చేసే ఈ చిన్న త్యాగమే మీ పిల్లలను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచస్థాయిలో రాణించిందంటే ఆమె తల్లిదండ్రులు చేసిన త్యాగం, కృషి తెరవెనుక ఎంతో ఉందన్నారు. మన పిల్లలు మహబూబ్‌నగర్‌లోనే చదువుకోవాలనే ఉద్దేశంతో గత 20 నెలల్లోనే పాలమూరు యూనివర్సిటీలో కొత్తగా ఇంజినీరింగ్, లా కళాశాలలు తెచ్చామని, ఐఐఐటీ కళాశాల సైతం ఇక్కడ తీసుకురావడంలో సఫలీకృతం అయ్యామని చెప్పారు. రానున్న రోజుల్లో ఫార్మసీ, అగ్రికల్చర్, ఎంబీఏ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలను తెస్తామన్నారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్, నాయకులు వినోద్‌కుమార్, సిరాజ్‌ఖాద్రీ, సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ శ్రీనివాస్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు మనోహర్, రామకృష్ణ మఠం ప్రతినిధి రాజమల్లేష్, వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.