రైతులతో ఆరా తీసిన కలెక్టర్ విజయేందిర
జడ్చర్ల: ‘ఎకరాకు ఎంత యూరియా వాడుతున్నారు’ అంటూ రైతులతో కలెక్టర్ విజయేందిర ఆరా తీశారు. పంటలకు అవసరం మేరకే యూరియా వినియోగించాలని సూచించారు. గురువారం జడ్చర్లలోని ఎరువుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలు, పంపిణీ, ధరలు తదితర వివరాలు తెలుసుకున్నారు. జిల్లాకు 450 మె.ట., యూరియా రాగా 60 శాతం మార్క్‌ఫెడ్‌కు, మిగతా 40 శాతం డీలర్లకు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేస్తున్నామని, పట్టాదార్ పాసుపుస్తకంతోపాటు ఆధార్ నంబర్ నమోదు చేసుకుని పారదర్శకంగా అందజేస్తున్నట్లు చెప్పారు.
ఎకరాకు ఎన్ని బస్తాల యూరియా వేస్తున్నారని రైతులను కలెక్టర్ ప్రశ్నించగా.. 3, 4 బస్తాలు వినియోగిస్తున్నట్లు చెప్పడంతో అలా చేయవద్దని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రెండు దఫాలుగా రెండు బస్తాలు వేయాలని సూచించారు. యూరియా కొరత లేదని, దశల వారిగా వస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. అనంతరం మార్క్‌ఫెడ్ గోదాంలో ఎరువుల నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నర్సింగ్‌రావు, ఏఓ గోపినాథ్, ఏఈఓలు నర్సింహులు, శారద తదితరులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. జడ్చర్లలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి.. వంటశాల, పరిసరాలను పరిశీలించారు. మెనూలో పేర్కొన్న విధంగా భోజనం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది శుచి, శుభ్రతతో కూడిన రుచికరమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని.. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఎకరాకు ఎంత యూరియా వాడుతున్నారు?