
జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద
● 4 క్రస్ట్ గేట్లు తెరిచి దిగువకు నీటి విడుదల
ధరూరు/ఆత్మకూర్/మదనాపురం/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మళ్లీ పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 39 వేల క్యూసెక్కులు ఉండగా.. గురువారం రాత్రి 7.30 ప్రాంతంలో 62 వేల క్యూసెక్కులకు పెరిగిందన్నారు. విద్యుదుత్పత్తికి 43,640 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71, ఎడ మ కాల్వకు 550, కుడి కాల్వకు 690 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 9.070 టీఎంసీలు ఉందన్నారు.
● కొనసాగుతున్న విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతుందని ఏఈ శ్రీధర్ తెలిపారు. గురువారం ఎగువ 6 యూనిట్ల నుంచి 234 మెగావాట్లు, 310.136 మి.యూ., దిగువ 6 యూనిట్ల నుంచి 240 మెగావాట్లు, 337.283 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 647.419 మి.యూ. విద్యుదుత్పత్తి సాధించామని చెప్పారు.