
ఆర్టీసీ టూర్ ప్యాకేజీకి విశేష స్పందన: ఆర్‌ఎం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోందని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ రీజినల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టూర్ ప్యాకేజీల్లో భాగంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రతి నెల పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక బస్సుల ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ డిపోల నుంచి భక్తులతో అరుణాచలంకు రెండు బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా మరిన్ని నడుపుతామన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘యాత్రాదానం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. దేశంలోని ఏ ఆర్టీసీ సంస్థ ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టలేదన్నారు. అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడమే ఈ యాత్రదానం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. దాతలు అందజేసే విరాళాల ఆధారంగా ఆర్టీసీ యాత్రాదానం పేరిట సదుపాయాన్ని కల్పించనట్లు తెలిపారు. ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు లాంటి వారు స్పాన్సర్ చేస్తే పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు తీసుకెళుతామన్నారు. ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి పర్యాటక స్థలాలకు వెళ్లలేకపోయే వారికి ఈ యాత్రదానంతో అవకాశం కల్పించవచ్చని అన్నారు. జిల్లాలోని ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయని, ఈ యాత్రదానం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. యాత్రాదానం కార్యక్రమం మన రాష్ట్రానికే పరిమితం కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల, విజ్ఞాన వినోదకేంద్రాలకు కూడా పంపుతామని అన్నారు. అనంతరం యాత్రాదానం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంలు లక్ష్మి ధర్మ, కవిత, అకౌంట్ ఆఫీసర్ గంగాధర్. పర్సనల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ డిపో మేనేజర్ సుజాత పాల్గొన్నారు.