
ఆరోగ్యశ్రీలో ఓపెన్ హార్ట్ సర్జరీ
పాలమూరు: జిల్లా కేంద్రంలోని సుశ్రుత ప్రజావైద్యశాల వైద్యబృందం ఓ పేద మహిళకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. గురువారం ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆస్పత్రి ఎండీ డా.మధుసూదన్‌రెడ్డి, గుండైవెద్య నిపుణుడు భరత్ మాట్లాడుతూ.. దేవరకద్ర మండలం గోపన్‌పల్లికి చెందిన లక్ష్మి రెండు నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిందని తెలిపారు. ఆమెకు మొదట ఈసీజీ, 2–డీ ఈకో,యాంజోగ్రామ్ పరీక్షలు చేయగా.. గుండెలోని ఎడమ కవటం పూర్తిగా మూసుకుపోవడంతో పాటు ఐదు సెం.మీ. వెడల్పులో రక్తం గడ్డకట్టి ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆరు వారాల పాటు గడ్డకట్టిన రక్తం పలచబడటం కోసం మందులు, ఇంజక్షన్స్ ఇచ్చినట్లు వివరించారు. ఆ తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఎడమ కవటం మార్పిడి చేసినట్లు తెలిపారు. ఇదే సర్జరీ బయట చేయాలంటే దాదాపు రూ. 6లక్షలతో పాటు మెడిసిన్ ఖర్చు ఉంటుందన్నారు. కానీ సుశ్రుత ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా చేసినట్లు తెలిపారు. సీటీ సర్జన్స్ డా.హేమంత్, డా.ప్రవీణ్, మత్తుమందు డా.శ్రీధర్, గుండె వైద్యుడు భరత్ బృందం దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా పూర్తిచేసినట్లు వివరించారు. ఈ ఆస్పత్రిలో ఇప్పటి వరకు వంద కేసుల వరకు స్టంట్ వేయడం జరిగిందని.. త్రంబో లైసిస్ వంటి సేవలు ఆరోగ్యశ్రీలో అందించినట్లు వెల్లడించారు. ప్రతి గురువారం ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన సీటీ సర్జరీ ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.