
ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి
మన్ననూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల స్ఫూర్తితో సమాజంలోని సకల జనుల సమస్యల పరిష్కారానికి మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. గురువారం మన్ననూర్‌లోని సైమన్ రాములు స్మారక స్తూపం వద్ద అచ్చంపేట డివిజన్ సీపీఐ కార్యదర్శి పెర్ముల గోపాల్ అధ్యక్షతన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్‌నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలకు ఉమ్మడి జిల్లాతోపాటూ అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి డివిజన్‌లోని ఏ మారుమూల పల్లెకు వెళ్లిన ఆనాటి వీరోచితమైన తెలంగాణ సాయుధ పోరాట త్యాగాలకు సంబంధించిన గుర్తులు కనిపిస్తాయన్నారు. సాయుధ పోరాటాల స్ఫూర్తిని నేటి తరాల వారికి తెలియజేసేందుకు ప్రతిఏటా సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు బాసటగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో హామీ ఇచ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు కేశవులుగౌడ్, నర్సింహ, విజయ్, కృష్ణాజీ, శంకర్‌గౌడ్, రవీందర్, శివశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, శివుడు, కిరణ్‌కుమార్, శ్రీనివాసులు, లక్ష్మీపతి, అంజి, అశోక్‌గౌడ్, చంద్రయ్య, నాయకులు నర్సింహ, చందు, పర్వతాలు, కేశవులు, మధు, సర్వేశ్వర్ పాల్గొన్నారు.