
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఎంప్లాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజసింహుడు ఆధ్వర్యంలో జరిగిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులది ప్రధానమైన పాత్ర అన్నారు. ప్రగతి రథ చక్రాలను ఆపేసిన ఆర్టీసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు మొండిచెయ్యి దక్కిందన్నారు. ఇది ఎవరు కాదన్నా.. నిజాయితీగా మాట్లాడుతానన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని, తనవంతుగా రూ.5 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. టీజీఎంఎఫ్‌సీ చైర్మన్, ఫోరం గౌరవాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అఽధికార ప్రతినిధి జహీర్ అక్తర్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, నాయకులు ఎన్‌పీ వెంకటేశ్, సిరాజ్‌ఖాద్రీ, గోపాల్‌యాదవ్, సీజే బెనహర్, రాములుయాదవ్, అజ్మత్‌అలీ, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఫోరంనాయకులు సుధాకర్, ఎంవీ.కృష్ణ, నాగేశ్వర్‌రావు, దేవదాస్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.