
ఆత్మహత్యాయత్నం ఘటనపై ఆర్డీఓ విచారణ
మిడ్జిల్: మండలంలోని వాడ్యాల్‌కు చెందిన రైతు గజ్జల జంగమ్మ, ఆమె కుమారుడు గజ్జల కృష్ణయ్య సోమవారం తహసీల్దార్ ఎదుట పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై బుధవారం మహబూబ్‌నగర్ ఆర్డీఓ నవీన్‌కుమార్ బుధవారం గ్రామస్తుల సమక్షంలో సర్వేనెంబర్ 156 వద్ద విచారణ చేపట్టారు. తాత, ముత్తాతల కాలం నుంచి ఉడ్డాల లెక్కన పంచుకున్నామని, మూడు, నాలుగు సర్వే నంబర్లలో ఒక్కొక్కరికి ఒకటి, మూడు, నాలుగు గుంటల భూమి ఉండడంతో అప్పట్లో సాగు చేయడం ఇబ్బందిగా ఉంటుందని ముగ్గురు ముత్తాతలు మూడుచోట్ల పంచుకున్నారని, ఎవరి భూమిపై వారు మోఖాపై ఉన్నారని గ్రామస్తులు ఆర్డీఓకు వివరించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ.. సమస్యను అందరు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. అలాగే రైతు జంగమ్మ కుమారుడు కృష్ణయ్య తాను ఈ విషయంలో తొందరపడ్డానని.. తనదే తప్పని తహసీల్దార్ యూపీరాజుకు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు. ఆర్డీఓ వెంట రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.