
స్వయం సమృద్ధి సాధించాలి
భవనాలు, సిబ్బంది లేరు..
పంచాయతీరాజ్ వ్యవస్థ పురాతనమైంది..
● స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
● రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్
సిరిసిల్ల రాజయ్య
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్థానికంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా వినూత్న ఆలోచనలు, పద్ధతులతో స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులతో పాటు అనవసర వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరుల రాబడిని పెంచుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. బుధవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు రమేష్, సంకిపల్లి సుధీర్‌రెడ్డితో కలిసి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్ సంతోష్, ఆదర్శ్ సురభి, బీఎం సంతోష్, నారాయణపేట అదనపు కలెక్టర్ రెవెన్యూ జిల్లాల వారీగా స్థానిక సంస్థల పనితీరును చైర్మన్‌కు వివరించారు. మున్సిపాల్టీలు, గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న ఆదాయం తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన నిధులు, వాటి ఖర్చు వివరాలను గణాంకాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొదటగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థలు ప్రజలకు సమర్థవంతంగా వసతులు, సేవలు అందించాలని.. ఇందుకు అధికారులు అంకితభావంతో పని చేయాలని కోరారు. తడి, పొడి చెత్త నిర్వహణ అవలంబించి మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను కమిషన్ అధ్యయనం చేస్తోందని తెలిపారు. గ్రామపంచాయతీలు తడి, పొడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారుచేసి మహిళా సంఘాల ద్వారా విక్రయించవచ్చని, తద్వారా ఆదాయంతో పాటు భూ సారం పెరుగుతుందని వివరించారు. మూడు, నాలుగు పంచాయతీలు కలిసి క్లస్టర్‌గా ఏర్పాటు చేసుకొని చికెన్ వ్యర్థాలకు టెండర్ వేసి వచ్చిన ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన పంచుకోవచ్చని సూచించారు. కొత్త గ్రామపంచాయతీలుగా మారిన తండాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీధి దీపాలకు సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తే విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని.. ప్రయోగాత్మకంగా చిన్న గ్రామపంచాయతీల్లో అమలు చేస్తూ క్రమంగా అన్ని స్థానిక సంస్థలకు విస్తరించాలని తెలిపారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుం వసూలు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు.
పదేళ్లలో కొత్త మండలాలు, గ్రామాలు ఏర్పాటయ్యాయని.. చాలాచోట్ల భవనాలు, సిబ్బంది లేరని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తెలిపారు. సీనరేజ్, స్టాంపు డ్యూటీ స్థానిక సంస్థలకు రావడం లేదని, గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం కమిషన్ సభ్యుడు సంకిపల్లి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ .. స్థానిక సంస్థల్లో పని చేస్తున్న అనుభవం ఉన్న అధికారులు ఆదాయ వనరుల పెంపునకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు, కార్యదర్శి కాత్యాయని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, దేవ సహాయం, యాదయ్య, నర్సింగ్‌రావు, ఉమ్మడి జిల్లా జెడ్పీ సీఈఓలు వెంకట్‌రెడ్డి, యాదయ్య, డివిజనల్ పంచాయతీ అధికారులు, పుర కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థ పురాతనమైందని.. రాజీవ్‌గాంధీ 73, 74 రాజ్యాంగ సవరణలతో అధికారాలు బదలాయించి వికేంద్రీకరించారని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేశారని.. గ్రామపంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా నిధులు వస్తున్నాయన్నారు. గ్రామానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారుచేసుకొని ప్రాధాన్యత ప్రకారం పనులు పూర్తిచేస్తే అభివృద్ధి చెందుతాయని సూచించారు.

స్వయం సమృద్ధి సాధించాలి

స్వయం సమృద్ధి సాధించాలి