
ఆత్మహత్య ప్రేరకాలను గుర్తించడం అవసరం
పాలమూరు: చిన్నచిన్న ప్రవర్తన మార్పులే వ్యక్తి మనోవేదనను సూచించవచ్చని, ఆత్మహత్య ప్రవర్తనకు దారితీసే ప్రారంభ సంకేతాలు, ప్రేరకాలను గుర్తించడం చాలా అత్యవసరం అని ఎస్‌వీఎస్ ఆస్పత్రి మానసిక వైద్య విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ అశోక్‌రెడ్డి అన్నారు. ఎంతో ఒత్తిడిని ఎదుర్కొనే తర్వాతే ప్రాణం తీసుకోవాలనే ఆలోచన కల్గుతుందని, ఆత్మహత్యలను నివారించవచ్చని, మానసిక సమస్యలను గుర్తించి వాటికి సరిపడ వైద్య కౌన్సిలింగ్ తీసుకోవాలన్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎస్‌వీఎస్ మానసిక విభాగం ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణపై ప్రత్యేక నాటక కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాల దుర్వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు సాయం కోరే విధంగా భయపడకుండా ముందుకు రావడానికి సహాయక వాతావరణం సృష్టించాలన్నారు. ఆ తర్వాత మానసిక ఆరోగ్యంపై ఎంబీబీఎస్ విద్యార్థులు ప్రత్యేక నాటకం ద్వారా ఒత్తిడి, ఆందోళన ఎదుర్కొనే వ్యక్తులు ఎలా ఉంటారో ప్రదర్శించి చూపించారు. ఎస్‌వీఎస్ నర్సింగ్ విద్యార్థులు మైమ్ ప్రదర్శనలో ఆత్మహత్య ముప్పులో ఉన్న వ్యక్తుల మౌనవేదనను ప్రతిభింబించే విధంగా ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో ఎస్‌వీఎస్ రెసిడెంట్ డైరెక్టర్ రాంరెడ్డి, ప్రిన్సి పాల్ డాక్టర్ కేపీ జోషి, డాక్టర్ హరిప్రసాద్, వెంకట్ రాహుల్, భార్గవ్ స్వరాజ్, వినీల్ పాల్గొన్నారు.
● ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలను ఒంటరిగా మోయరాదని, ఒత్తిడిని ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల దగ్గర పంచుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధానంగా యువత చదువు, భవిష్యత్‌పై సోషల్ మీడియా ఒత్తిడి ఎక్కువగా పెరిగిందని పిల్లలతో పెద్దలు తరచూ మాట్లాడాలన్నారు. ఒత్తిడిలో ఉన్న వారి కోసం పోలీస్ శాఖ ప్రధానంగా హెల్ప్‌లైన్ నంబర్లు, కౌన్సిలింగ్ సౌకర్యం అందుబాటులో పెట్టడం జరిగిందన్నారు.
సీనియర్ మానసిక వైద్యనిపుణుడు
అశోక్‌రెడ్డి

ఆత్మహత్య ప్రేరకాలను గుర్తించడం అవసరం