
ఆకట్టుకున్న సాహిత్య అష్టావధానం
జడ్చర్ల టౌన్: కుతుబ్‌షాహి, అసఫ్‌జాహీల పరిపాలనలో దాదాపు 600 ఏళ్లు తెలుగు భాష నిరాధారణకు గురైనప్పటికీ తన ఔన్నత్యాన్ని కాపాడుకుందని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని చంద్రగార్డెన్‌లో ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో బి.శివకుమార్ నిర్వహించిన సాహిత్య అష్టావధాని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. వరంగల్ శ్రీరామ్ అవధానిగా, సంధానకర్తగా కంది శంకరయ్య వ్యవహరించగా 8 మంది సాహితి వేత్తలు పృచ్ఛకులుగా ప్రశ్నలు సంధించారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8, 9, 10వ వతరగతి విద్యార్థులు హజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అక్షరాస్యత లేని రోజుల్లోనూ తెలుగు భాష మనుగడ సాధించినా.. సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తున్న ప్రస్తుతం సమాజంలో ఇంగ్లిష్ చదువుల వల్ల తెలుగు మాట్లాడే వారి సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏడు వేల భాషలుండగా తెలుగు 11వ స్థానంలో ఉందని, భారతదేశంలో గతంలో రెండో స్థానంలో ఉండగా నేడు 4వ స్థానానికి పడిపోయిందన్నారు.
అష్టావధానం ఇలా..
అష్టావధానంలో మొదట నిషిద్ధాక్షరి అనే విభాగంలో కుంచకూరి బుచ్చిలింగం నిర్వహిస్తూ ఇప్పటి యువతకు ఆంజనేయుడు ఆదర్శం అనే అంశంపై పద్యం చెప్పమని కోరారు.
● సమస్యాపురాణం అనే రెండవ విభాగంలో.. చక్రవర్తుల రమణాచార్యులు నిర్వహిస్తూ హరిణము సమరమ్మునందు హస్తిని గూల్చెన్ (యుద్ధంలో జింక ఏనుగును చంపెన్) అనే సమస్యను ఇచ్చారు. కోరికయే ఏనుగుని మనసే జింక అని అవధాని సమస్యను పూరించారు.
● దత్తపది అనే విభాగంలో దార్ల రాఘవేంద్రచారి నిర్వహిస్తూ కల్లు, రమ్ము, బీరు, సారా అనే పదాలతో గణేషుడిని పూజించాలని చెప్పారు.
● న్యస్తాక్షరి అనే విభాగంలో యలకంటి భాస్కర్ నిర్వహిస్తూ య, ల, కం, టి అనే నాలుగు అక్షరాలు నాలుగు పాదాల్లో ఎక్కడెక్కడ రావాలో పేర్కొంటూ ప్రపంచ దేశాల్లో భారత ప్రధాని మోదీకి దక్కుతున్న గౌరవం గూర్చి శార్దూల వృత్తంలో చెప్పమన్నారు.
● వర్ణన అనే విభాగంలో కిరణ్మయి నిర్వహిస్తూ సభాధ్యక్షులు శివకుమార్‌ను శ్రీకృష్ణదేవరాయలుగా, పృచ్ఛకులను అష్టదిగ్గజాలుగా వర్ణించమన్నారు.
● ఆశువు అనే విభాగాన్ని మరింగంటి కృష్ణవేణి నిర్వహిస్తూ ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌లోనే గడుపుతున్నారని దాని దుష్ఫలితాల గూర్చి అప్పటికపుడు పద్యం చెప్పమన్నారు. అవధాని ఆశువుగా పద్యాన్ని చెప్పారు.
● చందోభాషణం అనే విభాగంలో పూదత్తు కృష్ణమోహన్ పద్యరూపంలో అవధానితో మాట్లాడారు. అప్రస్తుత ప్రసంగం అనే విభాగాన్ని సాకేత్‌ప్రవీణ్ నిర్వహించారు.