
మహాసభలను జయప్రదం చేయాలి
● వనపర్తిలో పీడీఎస్‌యూ
నాలుగో రాష్ట్ర మహాసభలు
● అక్టోబర్ 28, 29, 30న నిర్వహణ
వనపర్తి: జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న పీడీఎస్‌యూ నాల్గవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్‌రెడ్డి కోరారు. బుధవారం స్థానిక ఎంఎన్‌ఆర్ మినీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, ప్రధాన కార్యదర్శి సాంబ తదితరులు పీడీఎస్‌యూ కార్యకర్తలతో మాట్లాడారు. 70 మందితో ఆహ్వాన కమిటీను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. విద్యా రంగంలో వస్తున్న మార్పులు, సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపే విధంగా మహాసభల్లో చర్చించి విద్యార్థి భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ఎంచుకోవాలన్నారు. విద్యను పేద వర్గాలకు అందని ద్రాక్షగా మార్చేలా పాలకవర్గాలు, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడి అనుమతులు ఇస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా పీడీఎస్‌యూ లాంటి విప్లవ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామిక వాదులు, లౌకిక శక్తులు, మేధావులు, జర్నలిస్టులు, రచయితలు, కవులు, కళాకారులు, వ్యాపార వాణిజ్య వర్గాలు ఆదరించి మహాసభలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రాఘవాచారి, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కవి జనజ్వల, జాతీయ నాయకుడు విజయ్‌ఖన్నా, పాలమూరు అధ్యయన వేదిక నాయకులు వెంకటేశ్వర్లు, నారాయణ, పవన్‌కుమార్, రంజిత్, గణేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.