
గిరిజనుల సాధికారతకే ‘ఆదికర్మయోగి మిషన్’
● అన్నిశాఖల సమన్వయంతో పక్కాగా అమలు చేయాలి
● కలెక్టర్ విజయేందిర బోయి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఆదికర్మయోగి అభియాన్ మిషన్‌ను గ్రామస్థాయిలో అన్నిశాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులకు సాధికారత కల్పించడం, ప్రతిస్పందనాత్మక పాలన బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆది కర్మయోగి అభియాన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆది కర్మయోగి అభియాన్ మిషన్‌పై మిషన్ భగీరథ, విద్య, వైద్య, డీఆర్డీఓ, గిరిజన సంక్షేమ, మహిళా సంక్షేమ, అటవీ తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 10మండలాల్లోని 25 గిరిజన గ్రామాలను ఆది కర్మ యోగి అభియాన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రతిష్టాత్మకమైన సుపరిపాలనకు ఏడు శాఖల సమన్వయంతో ప్రతిపౌరుడికి పథకాలు అందేలా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. డిస్ట్రిక్ ప్రాసెస్ ల్యాబ్‌గా ఎంపిక చేసిన సిబ్బందికి కార్యక్రమం అమలులో 15అంశాలపై అవగాహన ఉండాలని తెలిపారు. జిల్లా ట్రైనర్లు 10, 11, 12 తేదీల్లో మండల బ్లాక్ ట్రైనర్లకు శిక్షణ నిస్తారని, బ్లాక్ ట్రైనర్లు గ్రామస్థాయిలో శిక్షణ నిస్తారని తెలిపారు. అవగాహన పొందిన సిబ్బంది గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టబడిన పథకాన్ని అన్నిశాఖల సమన్వయంతో గ్రామస్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు. అన్నిశాఖల సిబ్బంది ఆదికర్మ యోగి మిషన్‌పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని, ఎంపిక చేసిన గిరిజన గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర పథకాలు పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ మూడు రోజుల అవగాహన కార్యక్రమంలో సమగ్ర కార్యాచరణ తయారు చేసి అన్ని జీపీల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ భాగస్వామ్యంతో సాధికారత కల్పించే లక్ష్యంతో ఆదికర్మయోగి సిద్ధాంతం అమలు చేయనున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా ప్రభారి ప్రదీప్‌కుమార్ సింగ్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, డీఈఓ ప్రవీణ్‌కుమార్, మహిళా, శిశు సంక్షేమ అధికారి జరీనాబేగం తదితరులు పాల్గొన్నారు.