
బైక్ పైనుంచి పడి వ్యక్తి దుర్మరణం
మహమ్మదాబాద్: ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హన్వాడ మండలం నాయినోనిపల్లికి చెందిన వార్ల కృష్ణయ్య (53) అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్యతో కలిసి సోమవారం బైక్‌పై మండలంలోని మొకర్లాబాద్‌కు వెళ్లారు. పని ముగించుకొని రాత్రి 10 గంటల సమయంలో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా భారత్ రైస్‌మిల్ ఎదుట బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కృష్ణయ్య తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్థానికులు ఓ ప్రైవేట్ వాహనంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. కుమారుడు వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి వివరించారు.
బస్సు ఢీకొని కూలీ మృతి
మానవపాడు: ఆర్టీసీ బస్సు ఢీకొని కూలీ మృతిచెందిన ఘటన మంగళవారం 44వ నంబర్ జాతీయ రహదారి బోరవెల్లి స్టేజీ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ చంద్రకాంత్ కథనం మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా అనంతపూర్‌కు చెందిన పెరుమాల గోవింద్ (51) నిత్యం జాతీయ రహదారిపై రోజువారి కూలీగా పని చేస్తున్నారు. రోజులాగే మంగళవారం కూడా బోరవెల్లి స్టేజీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై పని చేస్తుండగా హైదరాబాద్ నుంచి నంద్యాల వైపు వెళ్తున్న నంద్యాల డిపో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు పెరుమాల జగదీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు.
అదృశ్యమైన వ్యక్తి
మృతదేహం లభ్యం
ఆత్మకూర్: ఓ వ్యక్తి కనిపించకుండా పోయి.. చెరువులో శవమై తేలిన ఘటన మంగళవారం ఆత్మకూర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేందర్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన పోతు నరేష్‌కుమార్ అలియాస్ నాని (42) పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. ఈ నెల 7న సాయంత్రం కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా ఇంటి నుంచి వెళ్లాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ల వద్ద ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పరమేశ్వరస్వామి చెరువులో శవం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయగా.. అది నాని మృతదేహంగా కుటుంబసభ్యులు గుర్తించారన్నారు. బావ మ్యాడం శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నాని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ అన్నారు.
విద్యార్థి అదృశ్యం
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ పాఠశాల నుంచి విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాలను కొంతకాలంగా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌న్‌పేట గ్రామ పరిధిలోని నేతాజీ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో గద్వాల్ జిల్లా లతిపురం గ్రామానికి చెందిన గొల్లతిప్పడంపల్లి శ్రీకాంత్ 7వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం 9గంటలకు పాఠశాల ప్రారంభమైయ్యే సమయానికి శ్రీకాంత్ కనిపించలేదు. హాస్టల్ చుట్టుపక్కల ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించకపోవడంతో హిందీ టీచర్ ఖారత్మల్ దయవంతి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
దాడి కేసులో
ఏడుగురికి రిమాండ్
గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలో మాజీ కౌన్సిలర్, వారి కుటుంబ సభ్యులపై అకారణంగా దాడి చేసి కులం పేరుతో ధూషించిన ఏడుగురిని అదుపులోకి తీసుకొని మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగులయ్య తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కాలనీకి చెందిన తాజా మాజీ కౌన్సిలర్ మహేష్, తండ్రి శ్రీనివాసులు, వినయ్‌పై చింతలపేటకాలనీకి చెందిన కొందరు యువకులు మద్యం మత్తులో అకారణంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి కులం పేరుతో ధూషించారన్నారు. అంతటితో ఆగకుండా వినాయకుడి లడ్డును సైతం అపహరించి మురుగు కాల్వ సమీపంలో విసేరేసి వెళ్లారని.. బాధితుడు వినయ్ ఫిర్యాదు మేరకు వారిపై ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు దాడికి పాల్పడిన ఘటనలపై అదేరోజు పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. మంగళవారం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని.. వారిని సైతం త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

బైక్ పైనుంచి పడి వ్యక్తి దుర్మరణం