
రాజ్యాంగ పరిరక్షణకు ఏకం కావాలి
అలంపూర్: రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలందరూ ఏకం కావాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి స్కైలాబ్‌బాబు పిలుపునిచ్చారు. మంగళవారం అలంపూర్ చౌరస్తాలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి అధ్యక్షతన ‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు గడిచినా.. రాజ్యంగ ఫలాలు సామాన్యులకు దక్కడం లేదన్నారు. దేశంలోని 200 మంది కోటీశ్వరుల ఆస్తులు 40 శాతం ప్రజల ఆస్తితో సమానంగా ఉన్నాయని.. జనాభాలో ఒక శాతం ఉన్న వారి చేతిలో 50 శాతం ఆస్తులు ఉన్నాయని వివరించారు. ఓ వైపు సంపన్నుల ఆస్తులు పెరుగుతుండగా.. 42 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని చెప్పారు. దేశంలో 80 కోట్ల మంది రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారంటే పేదరికం ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. బీజేపీ 11 ఏళ్ల పాలనలో సామాజిక, ఆర్ధిక అంతరాలు మరింత పెరిగాయని.. కార్పొరేట్ శక్తులకు రూ.లక్షల కోట్ల రాయితీలిస్తూ సామాన్యులపై పెను భారం మోపుతోందని విమర్శించారు. మత విధ్వేషాలు రెచ్చగొట్టి మనుషుల మధ్య విభజన తెస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ హయాంలో దళితులపై దాడులు, ధౌర్జన్యాలు 300 రేట్లు పెరిగాయని, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వివరాల ప్రకారం ఐదేళ్లలో 6,34,066 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 3.40 లక్షల ధౌర్జన్యాలు జరిగాయని.. బిహార్‌లో 65 లక్షల మందిని ఓటుకు అనర్హులుగా చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ఆధార్‌తో ఓటు హక్కు నమోదు చేస్తున్నారని తెలిపారు. మహిళల భద్రతలో దేశం 135 స్థానంలో ఉందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి నిధులు తగ్గించి పని దినాలు కల్పించడం లేదని.. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రైవేట్‌లో రిజర్వేషస్ల సాధనకు జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వశాంతి విద్యాసంస్థల కరస్పాండెంట్ మురళీధర్‌రెడ్డి, ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధానకార్యదర్శి ఆశన్న, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరంజ్యోతి, ప్రధానకార్యదర్శి రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు గట్టు మారెన్న, వెంకటస్వామి, విజయ్‌కుమార్, సవరన్న, రాజు, సుధాకర్, సంజీవ, నాగరాజు, మద్దిలేటి, సామేలు, నర్సింహ, మౌలాలి, జయన్న, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి
స్కైలాబ్‌బాబు