
ప్రాజెక్టులకు తగ్గిన ఇన్‌ఫ్లో
ధరూరు/ఆత్మకూరు/దోమలపెంట/రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో వరద మరింత తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు 65 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 7 గంటల వరకు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 45వేల క్యూసెక్కులకు తగ్గింది. విద్యుదుద్పత్తి నిమిత్తం 20,139 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 90 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,190 క్యూసెక్కులు, కుడి కాల్వకు 640 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 22,059 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.029 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా.. జూరాల ఎగువ, దిగువలో 12 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. రెండింటిలో కలిసి ఇప్పటి వరకు 632.233 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామన్నారు.
● శ్రీశైలం జలాశయంలో మంగళవారం 883.6 అడుగుల నీటిమట్టం వద్ద 207.8472 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 20,139, సుంకేసుల నుంచి 30,884 మొత్తం 51,023 క్యూసెక్కులఇ ఇన్‌ఫ్లో ఉంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,215, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 30,884 మొత్తం 66,199 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా 32,000, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,824, ఎంజికెఎల్‌ఐకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
సుంకేసులకు 43 వేల క్యూసెక్కులు
రాజోళి: సుంకేసుల డ్యాంకు మంగళవారం ఎగువ నుంచి 43,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 9 గేట్లను ఒక మీటర్ మేర తెరిచి 39,708 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.